గోపాలసామి
గోపాలసామి
- విరించిప్రియ
మేము హైదరాబాదు నుంచి బయలుదేరిన అయిదు గంటలకు కాని బాణాపురం చేరలేదు. మేము బాణాపురంలో బస్సు దిగేసరికి మధ్యాహ్నము పన్నెండయ్యింది. ఎండ మండి పోతుంది, బస్సులో జనం మధ్య ఉక్క పోసి వళ్ళంతా చెమటతో తడిసి పోయింది. కాని, బస్సు దిగిన తరువాత కచ్చడం బండిని, ప్రక్కనే మా కోసం నిల్చొని ఉన్న ఖాసింను చూసేసరికి నాకు, తమ్ముళ్ళిద్దరికీ ప్రాణం లేచి వచ్చింది. ప్రయాణం అలసట, వేడి, ఎండ, అన్ని ఎగిరిపోయాయి.అది మాకోసం మండవ నుంచి ఆమ్మ పంపించిందని వెంటనే మేము గుర్తు పట్టాము. ఇంతలో ఖాసిం మా దగ్గర నుంచి మా పెట్టెలందుకున్నాడు.
నా చేతిలో బాగ్ తో నేను బండి ఎక్కాను. "బాగున్నావా ఖాసిం, దేవుడిపెళ్ళి పనులు ఎలా సాగుతున్నాయి" అని అడిగాను. "ఇంక మీరు వచ్చారు కదా అమ్మాయిగారు ఇక సందడే సందడి" అని తెగ సంబర పడిపోయాడు.ఖాసిం మా ఆమ్మ వాళ్ళ జీతగాడు, మా చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గరే జీతం చెస్తున్నాడు.
ఆ బండికి కట్టి ఉన్న రెండు ఎడ్లని చూసి, "ఇవి సింగడు, రంగడు కదా, మరి గోపాలస్వామిని ఎందుకు తేలేదు" అని అడుగుతున్నాడు మా చిన్నతమ్ముడు. "గోపాలస్వామిని అరకకు కట్టారండి అబ్బాయి గారు," అని చెప్తున్నాడు ఖాసిం. మా పెద్దతమ్ముడు ముందుగా ఎక్కి ఖాసిం పక్కనెళ్ళి కూర్చున్నాడు. ఇక మా చిన్నతమ్ముడు చేసేది ఏమి లేక నాతో వెనకాల కూర్చున్నాడు. బస్సు కన్న బండి ఎంతో హాయిగా ఉంది. పరుపుమీద చేరి కూర్చొని నేను పచ్చని పొలాల్ని చూస్తు వాళ్ళ మాటలు వింటున్నాను.
ఎడ్లని ఉరికించమని తమ్ముళ్ళిద్దరు పట్టు పట్టటంతో ఖాసిం ఉత్సాహంతో ఛండ్రకోళ గాలిలో ఝుళిపించాడు. బండిని వేగాంగా పరిగెట్టిస్తూ, ఈ ఏడాదిలో ఎన్ని కోడెదూడలు పుట్టాయో, ఎన్ని లేగ దూడలు పుట్టాయో,వాటికి పెద్దనాన్నగారు ఏం పేరులు పెట్టారో అన్నీ చెపుతున్నాడు ఖాసిం.దేవుడి పెళ్లికి రికార్డ్ డాన్సు ట్రూపు ఊళ్ళోకి వచ్చేసిందని సంబరంగ చెప్తున్నాడు ఖాసిం.
మా తమ్ముళ్ళు అప్పుడే, గుమాస్తా రామలింగగారిని ఎల ఏడిపించాలో స్కీములు కడుతున్నారు. ఖాసిం కూడా వాళ్ళతో కలిసిపోయాడు. వాడికి కూడ వీళ్ళ ఆటలంటే బాగానే సరదా. మేము వెళ్ళేసరికి ఒంటిగంటయ్యింది. ఆమ్మ, పెద్దనాన్నగరు బయట వసారాలో కూర్హొని ఉన్నారు.
నేను బండి దిగి వెళ్ళి ఆమ్మను చుట్టేసాను. "అమ్మో! అమ్మో! ఎండంతా మీ పాలే అయ్యిందా అని ప్రేమంతా కురిపిస్తూ నన్ను దగ్గరకు తీసుకొని, "అమ్మ బాగుందానే, ఎప్పుడు తిన్నారో ఏమో కాళ్ళు కడుక్కోండి భోజనాలు వడ్డిస్తాను" అని వంట ఇంట్లోకి దారి తీసింది మా ఆమ్మ. మేము కాళ్ళు కడుక్కోవడానికి పెరట్లోకెళ్ళాము. బాగున్నారా అమ్మాయిగారు అంటూ, ఖాసిం అక్క మదార్బి, పలకరించింది. "బాగానే ఉన్నాం మదార్బీ, నీ కొడుకెలా ఉన్నాడు, మీ అక్క అలీమా బాగుందా, అని అడిగాను."అమ్మో అమ్మాయిగారికి అంతా గుర్తే" అని, అది ఆ ఒక్క మాటకే మురిసిపోయింది. మనకు పట్టణాలలో దొరకనిది ఇక్కడ ప్రతి మనిషిలో పుష్కలంగా ఉండేది ఈ అమాయకత, ఆప్యాయతే, అని అనుకుంటూ, అది ఇచ్చిన తువ్వాలందుకున్నాను.
ఎప్పటిలాగానే ఆమ్మ ఎంతో రుచిగా మా కోసం చాలా చేసింది. మేము మాత్రం ఆమ్మ పెట్టిన కొత్తావకాయా, గోంగూర పచ్చడి, వెన్నతో కలిపి లాగించాము. తింటున్నంత సేపూ అమ్మ ఎలా ఉన్నది అని వాళ్ళ చెల్లెలు గురించి తెగ బాధ పడి పోయింది మా ఆమ్మ.భోజనాలయ్యింతరువాత మా ఆమ్మ, పూజారి, వరదాచార్యులగారు వస్తే ఆయనకు కావలసినవి ఇవ్వటానికి లేచి వెళ్ళింది. తమ్ముళ్ళిద్దరు ఖాసింతో ఊళ్ళోకెళ్ళారు, నన్ను వెళ్ళనీయదు నాకు తెలుసు,"నువ్వు ఆడపిల్లవి ఇది మీ హైదరబాదు కాదు" అని స్తోత్రం మొదలు పెడ్తుందని ఊరుకున్నాను.నేను బయట వసారాలోకెళ్ళి కూర్చున్నాను. వాకిట్లో ఎర్క్ర్క మట్టితో గోడల్ని అలికి, సున్నముతో పట్టీలు గీస్తున్నరు చాకలి నర్సు, వాడి భార్య. ఎంతో అందంగా ముస్తాబవుతున్న ఆ గోడల్ని తన్మ్యంగా చూస్తున్నాను. అంతలో గొల్లరాముడు తను తోలుకొచ్చిన పషువుల్ని పెరట్లోకి తోలుకొని పోతు "ఓ అమ్మాయిగారెప్పుడొ వచ్చినట్లున్నారే!, అబ్బాయిగార్లు కూడా వచ్చారండి" అని పలకరించాడు.
నేను వాడితో మాట్లాడుతూండగా, మా ఆమ్మ "లతా ఇంట్లోకి రా పషువులు వచ్చేవేళ అయ్యిందీ" అని పిలిచింది. మా ఆమ్మకున్న మడి ఆచారాల్లలో ఇది ఒకటి. ఆవిడ ఒక సనాతన ధర్మాలు కల మనిషి. పొరపాటున ఎవరైన అంటరాని వారిని తాకితే నలభై సార్లు స్నానం చేయిస్తుంది. ఎన్ని ఆచారాలు ఉన్నా ఆమె మనస్సు చాల సున్నితమైనది. ఎవరినీ ఎన్నడూ నొప్పించి ఎరగదు. ఆఖరికి పిల్లలు లేరన్న బాధ కూడా ఎప్పుడూ బయట పెట్టదు. ఆ ఊరివారి కష్టసుఖాలు కనుక్కుంటూ, అందరికీ చేతనయైన సహాయం చేయడమే ఆమెకు తెలిసినది.దానికి తగ్గట్టుగా మా పెద్దనాన్నగారు కూడా దైవభక్తి, సహ్రుదయం కలవారు.
ఆయనకు ఆఊరి కరణంగా మంచి పేరు. నేను లోపలికి వెళ్ళేసరికి వరదాచార్యులగారు బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నారు. నన్ను దగ్గరికి పిలిచి ఆమ్మ నాచేత ఆయన కాళ్ళకి మొక్కించింది. ఆయన"సకల విద్యాప్రాప్తిరస్తు" అని దీవించి వెళ్ళారు. నేను ఆయన వెళ్ళిన వైపే చూస్తూ నవ్వుకున్నాను. దానికి మా ఆమ్మ "తప్పు ఆయన సాక్షాత్తుభగవత్ స్వరూపులు ఆయన వంటి మీదకు ఆంజనేయుడు వస్తుంటాడు" అని అంటుంటే చెంపలేసుకొని "ఆమ్మా! ఇంక చాల్లే కాని నాకు కాఫీ పెట్టీవ్వవూ, నీ చేతి కమ్మటి కాఫీ తాగి ఎన్నాళ్ళయ్యిందో" అని ఆమెను వంటింట్లోకి తీసికెళ్ళాను.
"చూసారా మిమ్మల్ని ఎలా తెలివిగా బుట్టలో వేసుకుంటుందో అమ్మాయిగారు" అంటూ వంటింట్లోకి వచ్చారు గుమాస్తా రామలింగంగారు."ఆ మీరు కూడా మా ఆమ్మ కాఫీ కోసమేకదండి ఇలా వచ్చింది, మీ హుషారు చూస్తుంటే, మా తమ్ముళ్ళిద్దరు ఇంకా మీకు ఎదురు పడ్డట్టు లేదు", అనేసరికి, అమ్మో అబ్బాయిగార్లు వచ్చే లోపు నేను పొలానికెళ్ళాలి లేకపోతే వాళ్ళూ వస్తామని గొడవ చేస్తారు అని పిలక సర్దుకుంటూ కాఫీ గ్లాసు కడిగి బోర్లించి, హడావిడిగా బయటకెళ్తుంటే నాకు ఆమ్మకు నవ్వాగలేదు. దేవుడిపెళ్ళ్కి ఇక రెండు రోజులే ఉన్నది. ప్రతి ఏడాది లాగానే ఆ ఏడు కూడా గుడి బయట అంగళ్ళు తెరిచారు.
డ్రామాలు వెయ్యటానికి వీలుగా ఒక స్టేజి కూడా ఏర్పాటు చేసారు. ఆరోజు సాయంత్రం అందరం డాబా మీదకెక్కి, గుడి బయట జరిగే హడావిడి అంతా చూస్తున్నాము."ఇక చీకటి పడ్తోంది కిందకువెళ్ళి భోజనాలు చేద్దాం" అని ఆమ్మ మంచం మీదనుంచి లేచింది.డాబా మీద చల్ల గాలికి ఎవరికి కదల బుద్దవ్వలేదు,ఎప్పటిలాగా వెన్నెలలో ఇక్కడే కూర్చొని తిందాం అని ఆమెను అక్కడే కూర్చోపెట్టి, మేము అన్నీ తేవడనికి కిందకు పరిగెత్తాం. "ఆ వేడి పప్పుచారు జాగ్రత్త! నెయ్యి అంట్ల గిన్నెలతో కలపద్దు"! అని వెనకాల నుంచి ఆమ్మ అంటోంది. "ఏం ఫరవాలేదామ్మా మాకు తెలుసుగా, నెయ్యి గిన్నె వేరే పెట్టాలి, ఖాసింను ముట్టుకోనీయద్దు, దేవుడి గదిలోకి వెళ్ళద్దు, మడి బట్టలు తాకొద్దు, అని మా పెద్దతమ్ముడు లిస్ట్ చదివాడు.
వెనకాలనుంచి ఆమ్మ పెద్దనాన్నగరు నవ్వడము వినిపించింది. ఆమ్మ అందరికి వడ్డించింది మేమంతా సరదాగా కబుర్లు చెప్పుకుంటు తింటున్నాము."పప్పుచారు చాలా బాగుందామ్మా ఇంకోసారి అని మేము ముగ్గురము పోటీపడి వంతులేసుకొని తింటున్నాము. ఇంతలో మెట్ల మీదనుంచి దగ్గు వినిపించింది.ఖాసిం ఇంకా చీకట్లో మెట్ల మీదకూర్చొని ఉన్నాడు. మేమందరము తిన్న తరువాత గాని వాడు తినడు. నాకు జాలేసింది. కానీ ఆమ్మ ఆచారాలు కూడా తెలుసు. వాడిని అక్కడే తిననీ అని ఎన్నోసార్లు అడిగాను.ఆమె ఒప్పుకోదు ఎందుకంటే ఆమె అలా పెరిగింది. "ఇదీ పల్లెటూరమ్మా ఇక్కడ కట్టుబాట్లు వేరు, మనమూ అలానే నడుచుకోవాలి", అని నాకు సర్ది చెప్పేది, వాదించి లాభం లేదు.
ఆమె ముఖంలోకి అలానే చూస్తున్నాను అబ్బ ఆమ్మకు ఎంత ఓపిక, ఆమె ముఖం మీద నవ్వు ఎప్పుడు చెరగదు. ఆమెది జాలి గుండే,కాని ఆమెలో జీర్ణించుకుపోయిన సనాతన ఆచారాలు, ధర్మాలు ఆమెను ఈ పని మాత్రం చేయనివ్వవు. లతా పెరుగేసుకోకుండా లేవకు అని మా ఆమ్మ పిలిచేసరికి ఈ లోకంలోకి వచ్చాను. తమ్ముళ్ళిద్దరు మాపెద్దనాన్నగారి దగ్గరకు చేరి సింగడూ, రంగడూ కథలు చెప్పమని అడుగుతున్నారు. మా పెద్దనాన్నగరు వాళ్ళ ఎడ్లకి పేర్లు పెట్టి వాట్ని హీరోలుగా కథలల్లి చెప్తారు. అవి అంటే మా అందరికి చాలా ఇష్టం.ఆ కథలో గోపాలస్వామి అనే ఎద్దు ప్రమాదస్థితిలో ఉంటే సింగడు, రంగడు వెళ్ళి ఎలా కాపాడాయో ఎఓతో నేర్పుగా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా చెప్పుకు పోతున్నారు.
అది వింటూ మేమంతా ఎప్పుడో నిద్రలోకి జారిపోయాము. కింద ఏదో అలజడి వినిపించింది. "దొరగారు,దొరగారు, అంటూ ఖాసిం అరుచుకుంటూ మేడమెట్లెక్కుతున్నాడు. మేమందరం ఉలిక్కి పడి లేచాము. మా చిన్నతమ్ముడు లేచి "బొడ్డెంకన్న దొంగ మళ్ళీ ఊళ్ళోకి వచ్చాడా ఏమిటి" అని అన్నాడు. దానికి మా పెద్దనాన్నగారు నవ్వుతూ "వాడొస్తే నీకేం భయం రా మీ నాన్న పోలీస్ ఆఫీసర్ కదా షూట్ చేసెయ్" అని నవ్వుతున్నాడు. అంతలో ఖాసిం మేడ మీదకొచ్చాడు. "అయ్యా గోపాలసామి తాడు తెంచుకొని నీళ్ళకని లోనికొచ్చి బావిలో పడింది" అన్నాడు. మా ఆమ్మ వెంటనే "అయ్యో! ఏమిటీ పరీక్ష స్వామీ నీ కార్యంలో ఏం లోపం జరిగింది అని అనుకుంటూ చెంపలు వేసుకుంటూ, దండాలు పెడ్తూ లేచింది. "గుమాస్తా రామలింగంగారికి కబురుపంపండి, అలాగే రొడ్డెంకణ్ణి, సాంబయ్యను, పటేల్ బక్షిమియాకి కబురు పంపండి.
ఊళ్ళోకి వెళ్ళి పెట్రోమాక్స్ లైట్లు,గేలాలు, మోట తాళ్ళుతెమ్మని చెప్పు, నేను వస్తున్నాను పద అని మా పెద్దనాన్నగారు కూడ మంచందిగారు. "గుమాస్తా గారికి పటేల్కి కబురుపంపానండి అంటూ ఖాసిం, క్షణం ఆలస్యం చేస్తే ఏమౌతుందో అన్నట్టు వేగంగా కిందకు దారితీసాడు. మా పెద్దనానగారు నడిచి వెళ్తుంటే ఆ వెన్నెల వెలుతురులో ఆయన ముఖం స్పష్టంగా కనబడుతోంది, ఆయన ముఖంలో ఎప్పుడూ చూడని ఒకలాంటి గంభీరత, కార్య దీక్షకనబడ్డాయి. మేమంతా మా ఆమ్మ మంచం మీదకు చేరాము. మా అందరికి తెలుసు, గొపాలసామి అంటే ఆమ్మకు చాల ఇష్టం అయిన ఎద్దు అని, అందుకే ఆమె కళ్ళు మూసుకొని విష్ణుసహస్రనామాలు చదువుకుంటూ ఉంటే మేము మాట్లాడుకుండా కూర్చున్నాము. అప్పుడే ఈ విషయం ఊరంతా ప్రాకినట్లుంది.
అక్కడక్కడ పెట్రోమాక్స్ లైట్లు, లాంతరలు కనబడుతున్నాయి. మా ముగ్గురికీ కిందకెళ్ళాలని ఉంది కాని ఆమ్మ పరిస్తితిని చూసి ఊర్కున్నాము. అంతలో ప్రక్కింటి భధ్రమ్మ ఒక పెద్ద లాంతరు పట్టుకొని "దొరసానిగారూ" అంటూ మేడమీదకొచ్చింది. భధ్రమ్మ తెచ్చిన లాంతరు సాయంతొ అందరం కిందకెళ్ళాము.మేము కిందకెళ్ళేసరికి ఊరంతా బావి చుట్టూ ఉన్నట్టుంది. బోలెడు పెట్రోమాక్స్ లైట్లు, అందులో జెవరు ఎవరో తెలీకుండా ఉన్నది. గుమాస్తా రామలింగంగారు కండువా నడుంకి చుట్టి బావి గట్టు మీద నిలబడి అందరికి పనులు పురమాయిస్తున్నారు. ప్రక్కనే మాదిగ రొడ్డోడు, పెట్రొమాక్స్ లైటు పట్టుకొని బావి లోకి తొంగి చూస్తున్నాడు. వాడు నడుంకి ఒక గోచి గట్టిగా బిగించి కట్టి ఉంది.
లైట్ల వెలుతురులో నల్లగా మెరుస్తున్నాడు. సాంబయ్య బావిలో దిగడానికి నడుంకి తాడు కట్టుకుంటున్నాడు. ఖాసిం ఒక బలమైన పలుపు తాడుని బావి గిరక మీద నుంచి ప్రక్కనే ఉన్న ఇనప దూలానికి గట్టిగా బిగిస్తున్నాడు. అక్కడ ఉన్న జనమంతా తలా ఒక రకంగా జరిగిన దాన్ని గురించి చర్చించుంకుంటున్నారు. "అసలు అంత పెద్ద ఎద్దు బావిలో ఎలా పడ్డదండి" అని అడుగుతోంది భధ్రమ్మ పక్కనే ఉన్న తన భర్తను. దానికి ఏసుపంతులుగారు "ఆ ఏముందే, నీళ్ళ కోసం అని వచ్చి ఉంటుంది, ఇది చాల పాత బావి కదా, దాని బరువుకి చుట్టు గోడ విరిగి అది అందులో పడిపోయింది. ఆ పక్కనే ఉన్న ఆమ్మ " ఇది మా మామగారి తండ్రిగారి కాలంలో తీయించిన బావి, రెండు తాటిచెట్ల లోతాయినా ఉంటుంది, గోపాలసామిని ఆ వేణుగోపాలుడే కాపాడాలి" అని మళ్ళీ దండం పెట్టుకుంది. అంతలో వరదాచార్యులవారు వ్చ్చారు.
మా ఆమ్మను చూసి ఏం దిగులుపడకండమ్మా గోపాలస్వామి తనను తానే కాపాడుకుంటాడు, నేను కూడా ప్రార్థన చేస్తాను కదా అని, ఆయన కూడా బావి దగ్గరకెళ్ళి నిల్చున్నారు. మా పెద్దనాన్నగారు వంట ఇంటి చపటా మీద నిల్చొని ఉన్నారు. అక్కడ నుంచి అంతా కనబడుతోంది, నేను తమ్ముళ్ళు నెమ్మదిగా అక్కడికి వెళ్ళి నిల్చున్నాము అక్కడ నుంచి చూస్తే, బావి, దాని చుట్టూ ఉన్న మనుష్యులు కనబడుతున్నారు. సాంబడు లోపలనుంచి అరుస్తున్నాడు, ఏమంటున్నాడో స్పష్టంగా వినిపించట్లేదు. బావి గట్టు మీద పెట్రొమాక్స్ లైట్లు పట్టుకొని రొడ్డోడు, చాకలి రామిగాడు, గొల్ల వెంకటేశం, నిల్చొని ఉన్నారు. ఖాసిం, బక్షిమియా, వెంకటరెడ్డి, పేరిరెడ్డి, బావి గిరక దగర నిల్చొని సాంబడు ఏమంటున్నాడో వినటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.
సాంబడి తమ్ముడు సాలె వీరాసామి అన్నకు సాయంగా లోపలికి దిగటానికి నడుంకి తాడు కట్టుకుంటునాడు. ఇద్దరూ బలమైన వాళ్ళు,అన్నిటికంటే ముఖ్యంగా గజఈతగాళ్ళు. ఆ పక్కనే ఏసుపంతులు, కంసాలి రామబ్రహ్మం, వరదాచార్యులవారు నిల్చొని ఉన్నారు. ఆయన ఏవో మంత్రాలు చదువుతూన్నారు. బావి లొపలనుంచి ఇప్పుడు సాంబడి తో పాటుగా వీరాసామి గొంతు వినిపిస్తోంది. ఇద్దరూ "ఎహేఎయ్!... నీ... గట్టిగా పట్టుకోండి, నా సామిరంగా! ఇది ఇందులోనే పడాల్నా! ఏం చేస్తున్నార్రా పాలేర్లు ! ఓస్! ఓసోస్! అని ఇద్దరు అన్నతమ్ములు ఆయాస పడ్తున్నారు.ఛట్! కదలమాకు వెలుతురు సరిగా పడనీయ్! అని దానికి రెట్టింపుగా రొడ్డోడ్ని గదమాయిస్తున్నారు గుమాస్తా రామలింగంగారు. వాడేమో లైటు పక్కన పెట్టి ఆత్రంగా బావిలోకి తొంగి చూస్తున్నాడు. "ఆఎద్దు వెల్లికిలాపడి ఉంటుందా, బోర్లా పడిఉంటుందా" అని కంసాలి రామబ్రహ్మం ఏసుపంతుల్ని ప్రశ్నిస్తున్నాడు. వెల్లికిల్లానేపడి ఉంటుంది అని తనకున్న కొద్ది సైన్స్ పాండిత్యాన్ని ప్రదర్సిస్తున్నారు ఏసుపంతులు. ఇంతలొ తాళ్ళూ! గోనెపట్టాలు దించండి అని బావిలోంచి సాంబడి గొంతు గట్టిగా వినిపించింది.ఆ క్షణంలో నాకు, అక్కడ గాంధీజీ కలలుకన్న నవ భారతసమాజం ఒక మెరుపు లాగ మెరిసింది.అదే ఆమ్మకు కూడా చూపిద్దామని ఆమెను అక్కడకు తీసుకొచ్చాను.
ఆమె చూస్తొంది, ఆ పెట్రొమాక్స్లైట్ల వెలుతురులో రొడ్డోడు, చాకలి రామిగాడు, ఖాసిం,పటేల్ బక్షిమియా, వెంకటరెడ్డి, పేరిరెడ్డి,ఏసుపంతులు, కంసాలి రామబ్రహ్మం, గుమాస్తా రామలింగంగారు అందరూ కలిసి పట్టుసడలకుండా తాళ్ళని పట్టుకున్నారు. లోపలనుంచి ఎహేయ్! గట్టిగా పట్టుకొండి అని సాంబడు, వీరాసామి, ఆ పక్కనే మంత్రాలు చదువుతున్న వరదాచార్యులవారు, అందరి ముఖాల్లో ఒకటే ఆతురత గొపాలసామిని ఎలా కాపాడాలి. అందరికీ తెలుసు అది అమ్మగారికి చాలా ఇష్టమైన ఎద్దు, అదీ కాకుండా అచ్చివచ్చిన ఇంటి కోడెదూడ అని. ఎక్కడా భేధభావంలేదు, బీద గొప్ప తేడా లేదు. ఆ కొద్ది క్షణాలు కులం, మతం తారతమ్యలు విస్మరించారు.
చేతులు కలిపి నడుం బిగించి ఏక దీక్షతొ చెమటలు కారుస్తూ తర్జన భర్జన పడుతున్నారు. ఎలా తీయాలి, అది బ్రతికి ఉందో లేదో అని ఆందోళన అందరి మనసుల్లో పీకుతోంది. కాని పైకి మాత్రం ఎవ్వరూ ఏమీ మాట్లాడటలేదు. గోనెపట్టాలకు తాళ్ళు కట్టి లోపలికి దించారు. లోపల పెనుగులాట వినపడింది. అంతలో అంబా! అన్న అరుపు వినిపించింది. అందరి ముఖాలు ఒక్క క్షణం ఆశ మెరిసింది. సాంబడు ఓస్! ఓస్! అని బుజ్జగిస్తున్నాడు. గోపాలసామికి సాంబడు అలవాటే, అందుకేనేమో అదీ వాడు చెప్పిన మాట వింటోంది.దాన్ని తాళ్ళతో బంధించారు. మూతికి చిక్కం కట్టారు. "ఇక పైకి లాగండి" అని అరిచాడు సాంబడు, కాని వాడికీ, అందరిలాగే ఇది సాధ్యమైన పనేనా అని మనసులో పీకుతున్నది. నెమ్మదిగా! అని అంత కంటే బిగ్గరగా అరుస్తున్నారు రామలింగంగారు.
వరదాచార్యులవారు ఏవో మంత్రించిన నీళ్ళు చల్లడం మొదలుపెట్టారు. మా ఆమ్మ మనసు కొద్దిగా కుదుట పడింది. నెమ్మదిగా తుర్పున వెలుగురేఖలు విచ్చుకుంటున్నాయి. అవి గుడి గొపురం మీద పడి అంతటా బంగారు కాంతులు విరజిమ్ముతున్నాయి. భధ్రమ్మ అందరికీ కాఫీ కలిపి తీసుకొని వచ్చింది. భధ్రమ్మ, నేను ఆమ్మ చేత కూడా బలవంతాన కొద్ది తాగించాము. బావి దగర పై నుంచి ఎంత మంది పట్టి లాగుతున్నా ఒక్క అంగుళం కూడా కదలడం లేదు. ఏసుపంతులుగారు కలగచేసుకొని ట్రాక్టర్ ఇంజను తీసుకొని వచ్చారు. తాళ్ళని నెమ్మదిగా ఇంజను వెనక భాగానికి కట్టారు. ఏసుపంతులు గారు "గొపాలస్వామికి జై! అంటూ ట్రాక్టర్ ను ముందుకి నడిపారు. నెమ్మదిగా లేత వెలుతురులో తెల్లటి, పెద్ద ఆకారం ఒకటి తాళ్లతో కట్టబడి బావి అంచుకి వచ్చింది. ట్రాక్టర్ని ఆపమని రామలింగంగారు అనటంతో, ఏసుపంతులుగారు ట్రాక్టర్ని ఆపి మళ్ళీ బావి దగ్గరకు వచ్చారు.
ఆ తాళ్ళు ఆ బరువును ఎక్కువ సేపు మోయలేవని తెలుసు. సాంబడు, వీరాసామి,గోపాలసామిని పకడ్బందీగానే బంధించారు. కాని అది విదిలించుకుంటే ఆ తాళ్ళు ఆపలేవు. ఆసంగతి అందరికీ తెలుసు. కాని అది కుడా అలసి పోయినట్టుగా ఉంది. ఎక్కువగా కదల్లేదు. అందరూ దాన్ని బావి గట్టు మీదకు చేర్చారు. హమ్మయ్య ఒక పెద్ద గండం గడిచింది అని అందరు స్థిమిత పడ్డారు. పక్క ఊరినుంచి గొడ్లడాక్టరు తెల్లవారేసరికి వచ్చాడు. అప్పటికే ఊళ్ళో ఉన్న జనం నెమ్మదిగా వచ్చి చూసి పోతున్నారు. అందరి నోట్లొ ఒకే మాట. "అమ్మో ఎంత గండం గడిచింది, ఏదైనా అయితే ఈ ఏడాది దేవుడిపెళ్ళి అయ్యేదానా, అమ్మగారిని ఆ గోపాలస్వామే కాపాడాడు". మేము ఇంట్లోకి వచ్చాము. వసారాలో పెద్ద మనుషులందరూ కూర్చొని ఉన్నారు.
బావిలో నీళ్ళు మొత్తం తోడించి పోయాలి అని, నీళ్లు ఇక వాడకానికి పనికి రావు అని ఏసుపంతులుగారు అంటున్నారు. అది కాదండి బావి చాలా లోతయినది అది కుదరని పని, నీళ్ళు టెస్టింగ్ కి పంపి ఆ తరువాత ఆ తాలుకాఫీసు వాళ్ళు ఎలా చెపితే అలా చేద్దాం అని మా పెద్దనాన్నగారు అన్నారు. ఆ పని పటేల్ బక్షిమియాకి అప్పగించారు. వరదాచార్యులవ్వరు "దొరగారూ" అంటూ మాప్ప్పెద్దనాన్నగారి దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడారు. ఆయన ఏమంటున్నారో అక్కడ ఉన్న అందరికీ తెలుసు. బావిని శూద్రాదులు, హరిజనులు ముట్టుకున్నారు కనుక దానిని సంప్రోక్షణ చేయవలసిన పని ఉన్నది, లేకపోతే దేవుడి గుడికి కాని ఇంట్లోకికాని, ఆ నీరు పనికి రాదు అని ఆయన ఆందోళన, ఆలోచన.దానికి మా పెద్దనాన్నగారు అమంగారిని అడిగి దానికి కావలసినవి చూడండి కానీ, నీళ్ళ టెస్టింగ్ అయ్యేంతవరకు నీళ్ళు వాడటానికి వీల్లేదు అని అందరికి గట్టిగా చెపపారు. నాకు మా పెద్దనాన్నగారు తీసుకున్న నిర్ణయం నచ్చింది. లోపలకు వచ్చే సరికి, మా ఆమ్మ, వరదాచార్యులవారితో మాట్లాడుతోంది.
ఆయన ఏదొ చెప్తున్నారు, ఆమ్మ శ్రద్ధగా విటోంది. మధ్య మధ్యలో అయ్యో అపచారం కదా, అని చెంపలేసుకుంటోంది. నాకు వాళ్ళ ఇద్దరి సంభాషణ వింటే నవ్వాగలేదు, ఎవరికోసమైతే ఆమె చెంపలేసుకుంటోదో వాళ్ళే లేకపోతే ఈ వేళ గోపాలసామి బ్రతికేదా? ఆ విషయం నేను, వరదాచార్యులవారు వెళ్ళిన తరువాత ఆమ్మ్మతో అన్నాను. "నీదంతా చాదస్తం ఆమ్మా" అనీ దానికి ఆమె "అది కాదే నీవు చెప్పింది నిజమే, కానీ ఊళ్ళో బ్రాహ్మలు, ఊరుకోరు కదా, బావికి సంప్రోక్షణ చెయ్యనిది వాళ్ళు మన ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరు. ఇవన్నీ ఎందుకొచ్చిన గొడవలు, వాళ్ళు చెప్పినట్లు చేస్తే నాకు ఇప్పుడొచ్చిన పెద్ద నష్టం ఏముందీ అని నాకు సర్ది చెప్పి, ఆమె ఇంకాసేపు అక్కడే ఉంటే నేను ఎక్కడ లేని పోని ఉపన్యాసాలు ఇస్తానోనని వెంటనే పని ఉన్నట్లు వెళ్ళిపోయింది.
నాకు మాత్రం , మన సమాజంలో ఎప్పుడు మార్పు వస్తుంది? మరి అంతా గాంధేయవాదులే కదా అయినా ఇంకా ఈ తేడాలెందుకు అని అనుకుంటూ నిద్ర ముంచుకొస్తుంటే మళ్ళీ వెళ్ళి పడుకున్నాను.తెల్లవారుఝామున మంగళవాద్యాలు వినపడుతునాయి, అప్పటికే మా ఆమ్మ స్నానం పూజ అయ్యింది. రాత్రికి స్వామి వారి కళ్యాణం. రోజంతా ఏవొ కార్యక్రమాలు ఊళ్ళోవాళ్ళకి అన్న దానం, గోపాలస్వామిని,అమ్మవారిని, పెళ్ళికొడుకు, పెళ్ళికూతుర్ని చేయడం, ఇంకా ఎన్నో ఉన్నాయి ఆ రోజంతా. మదార్బి "అమ్మాయిగారు స్నానానికి నీళ్ళు తోడాను లేవండి, తలంటుకోవాలి, బేగి రండి," అని పిలిచింది. ఇక ఇప్పుడు తలంటి వద్దని గొడవ చేసినా లాభం లేదని దాని వెనకాలే స్నానాల గదికి వెళ్ళాను. మా ఆమ్మ నాకోసం కుట్టించిన పట్టు పరికిణి జాకెట్టు వేసుకొన్నాను. మదార్బి జడ కుప్పెలు పెట్టి జడ వేసింది. నేను తయారయి వచ్చేసరికి ఆమ్మ వంటింటి గుమ్మంలో పూజా పళ్ళెంతో, గుడికి వెళ్ళటానికి రెడీగా ఉంది.ఎర్క్ర్క పట్టుచీర గోచి పోసి కట్టుకుంది, ముడి వేసుకొని, మెళ్ళో తెల్లరాళ్ళ నెక్లెసు,పెద్దగొలుసుతో అచ్చం లక్ష్మీ దేవిలాగా ఉంది. నన్ను చూసి, ఊళ్ళో వాళ్ళ కళ్ళన్నీ ఈవేళ నీ మీదే అని అన్నది. నేను ఆమె ప్రేమకి మనస్సులోనే "ఆమ్మా నా మీదా, నీ మీదా!" అని నవ్వుకున్నాను.నన్ను తేరిపారా చూసి పెరట్లొ ఉన్న గులాబి పూవు కోసుకొని పెట్టుకొమ్మంది. నేను పూవు కోద్దామని వెళ్ళేసరికి రొడ్డోడి చంటిపిల్ల బావి గట్టు మీద నీళ్ళల్లో ఆడుకుంటోంది.
చుట్టు చూసాను, ఎవ్వరు కనిపించలేదు, నాకు తెలుసు ఆ సమయంలో జీతగాళ్ళంతా గుళ్ళో ఉన్నారని, దూరంగా రొడ్డోడు పేడకళ్ళెత్తుతూ కనిపించాడు. వాడి భార్య మైసమ్మ ఆవులకి మేత వేస్తోంది. నాకేం తోచలేదు, వెంటనే ఆ పిల్లనెత్తికెళ్ళి కొట్టంలో ఉన్న మైసమ్మ కిచ్చి "పిల్లను బావి దగ్గర వదిలివేస్తావా, నేను చూశాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమై ఉండేదో" అని గట్టిగా చీవాట్లు పెట్టేసరికి అది బెదిరిపోయి "అమ్మాయిగారు నన్ను కేకెయ్యాల్సిందండి, మీరెందుకు ముట్టుకున్నారు దీన్ని, అమ్మో అమ్మగారు చూస్తే కోప్పడతారు, అని ఇంకా ఏదో అంటూనే ఉంది. అంతలొ రొడ్డోడు పరిగెత్తుకొచ్చాడు. "ఏం కాదులే పిల్లను నీ దగ్గరే జాగ్రత్తగా ఉంచుకో" అని నేను వంటింటి మెట్లు ఎక్కేసరికి గుమ్మంలో ఆమ్మ నిల్చొని ఉంది. ఆమె ముఖం చూస్తే అంతా చూసి నట్టే ఉంది.
నాకు తెలుసు, ఇప్పుడు ఈ బట్టలతో నేను మళ్ళీ తలార స్నానం చెయ్యాలని, నువ్వు వెళ్ళు ఆమ్మా నేను స్నానం చేసి వస్తాను అని అన్నాను. ఆమె నన్ను దగ్గరకు తీసుకొని "నిన్నేం చెప్పావు, దేవుడు మంచి పనులు హర్షిస్తాడన్నావు కదా! నీకేం తప్పులేదు, ఆ గోపాలస్వామి నిన్నందుకే అప్పుడు పెరట్లోకి పంపాడు. "ఈ చాదస్తాలు మా తరంతోనే పోనివ్వు, మీ మీద రుద్దాలని నా ఉద్దేశ్యం కాదు" అని నా ముఖంలోకి చూసింది. ఈ విషయం ఎవరితొ అనవద్దు అన్నట్టుంది ఆమె చూపు.అందరం గుళ్ళోకి వెళ్ళాము. వరదాచార్యులవారు ఆ రోజు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. మల్లెపూల గుబాళింపుతో, పట్టుపీతాంబరంతో, నుదుట కస్తూరి తిలకంతో మెళ్ళో బంగారు పతకంతో ఆ వేణుగోపాలస్వామి మెరిసిపోతున్నాడు. నేను ఎంతొ భక్తితో నమస్కరించాను. స్వామీ సమాజంలో మార్పు కోసమేనా ఈ లీలంతా నడిపించావూ! నిన్ను కనుగొనడం ఎవ్వరి తరం ?
Comments